2023 నాటికి ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి స్థితికి భారతదేశం: శ్రీ గౌడ
"ఆత్మ నిర్భర్ భారత్" కార్యక్రమంలో భాగంగా భారత్ ఎరువుల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశంలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త ఎరువుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయబడుతున్నాయని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ అన్నారు. దీంతో 2023 నాటికి భారతదేశం ఎరువుల ఉత్పత్తిలో స్వావలంబన స్థితికి చేరుతుందని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ అన్నారు.
కర్ణాటక రైతుల కోసం ఇఫ్కో నిర్వహించిన “సెల్ఫ్ రిలయంట్ ఇండియా అండ్ సస్టయినెబుల్ అగ్రికల్చర్” అనే వెబ్‌నార్‌లో శ్రీ గౌడ ప్రసంగించారు. “ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ దృష్టి ప్రకారం స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి మేము అన్ని ఎరువుల కంపెనీల్ని గ్యాస్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానానికి మారుస్తున్నాము. ఇటీవల భారతదేశంలో నాలుగు యూరియా ప్లాంటులను (రామగుండం, సింధ్రి, బరౌని,గరఖ్‌పూర్) పునరుద్ధరించాము. 2023 నాటికి ఎరువుల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధిగా మారాలి” అని మంత్రి అభిలషించారు.
దేశంలో సేంద్రీయ, నానో ఎరువుల వాడకాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఇవి నేల ఆరోగ్యాన్ని కాపాడుతూనే 25 నుంచి 30 శాతం తక్కువ ధరలకే అందుబాటులోకి రావడంతో పాటుగా 18 నుంచి 35 శాతం అధిక దిగుబడులను ఇస్తున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఇఫ్కో యొక్క నానో ప్రయోగాన్ని ప్రశంసించారు. దానిని గేమ్ ఛేంజర్‌గా మంత్రి అభివర్ణించారు.
దేశవ్యాప్తంగా దాదాపు 12 వేల మంది రైతులకు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ఉచితంగా పంపిణీ చేసిన నానో ఎరువులు సానుకూల స్పందన ఇచ్చాయని ఆయన తెలియజేశారు. యూరియాను అధికంగా వాడటం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుందని కాబట్టి తగిన విధంగానే ఉపయోగించాలని శ్రీ గౌడ రైతులను కోరారు. రైతులు తమ భూ ఆరోగ్య కార్డుల ప్రకారం ఎరువులను వాడాలని సూచించారు.
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కాలంలోనూ ఎరువులు క్రమం తప్పకుండా సరఫరా చేయడమే కాకుండా, కోవిడ్-19 వ్యాప్తిని తగ్గించడానికి మాస్క్‌లు, శానిటైజర్లు మరియు చేతి తొడుగులు పంపిణీ చేయడం, ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఇఫ్కో చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. కోవిడ్ మహమ్మారి కాలంలో ఎరువులు సకాలంలో సరఫరా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించినందుకు ఇతర ఎరువుల కంపెనీలకు, రైల్వే శాఖకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జూమ్ ద్వారా నిర్వహించిన ఈ వెబ్‌నార్‌లో కర్ణాటకకు చెందిన 1500 మందికి పైగా రైతులు పాల్గొన్నారు.
ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యు.ఎస్. అవస్థీ, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్, ఇఫ్కో కర్ణాటక మార్కెటింగ్ మేనేజర్ డాక్టర్ నారాయణస్వామితో పాటుగా బెంగుళూరులోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటుగా ఇతర ప్రముఖులు కూడా ఈ వెబ్‌నార్‌లో పాల్గొన్నారు.